Sunday, 13 April 2025

హక్కుల సూర్యుడు

హక్కుల సూర్యుడు............ అఖండ దీపంలా వెలిగే భరతఖండం విభాత సంధ్యాసమయ వికసితులైన ఖండాంతర వాసుల చెరలో బందీయై పెల్లుబికిన దుఃఖంతో విముక్తిని కోరుతున్న వేళ తల్లి భీమా భాయి ఒడిలో మట్టిలో మాణిక్యంలా మహాజ్వల దీపాంకురమై పీడిత ప్రజల గొంతుగా సైరన్ మోగిస్తూ పండు వెన్నెలలో పల్లవించాడు దళిత భాస్కరుడై ఆ అపార మేధావి బాల్య దశ విధ్యాభ్యాసమంతా అంటరానితనమనే నల్ల సముద్రాన్ని ఈదుకుంటూ అసమాన కుల దొంతరుల ఎడారిలో ఒడువ లేని కన్నీటి గాధతో ఊహించని పూలవనమై వికసించి వెలివాడలో చైతన్య దీపస్తంభమై నిటారుగా నిలిచింది తన జాతి మేల్కొలుపు కోసం నదులు ,సముద్రాలు దాటే పథీకుడై పీడిత ప్రజల సమస్య ఏదైనా బ్రతుకునిచ్చే కల్పవృక్షంలా వివిధ రూపాల్లో పరిష్కార ప్రతినిధి ఆయనే అందుకే ఆ మహానుభావుడు ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తిగా తులతూగుతున్నాడు రాజ్యాంగ రూపశిల్పిగా దేశానికి గుండెకాయయై కష్టాలను ఎదుర్కొని, స్వయంకృషితో ప్రపంచ చరిత్ర వాకిట్లో మేథో సంపత్తుతో నిండిన పేజీల పుస్తకంగా హక్కుల సూర్యుడై వెలుగందిస్తున్నాడు మన కలల సాకారం కోసం తన రక్తాన్ని చెమట చుక్కలుగా ధారపోసి తన జాతి ఉద్ధరణకై పునరంకితమై పేదల ఆకలి మంటలు తీర్చే ఆశల పురిటి స్వప్నమయ్యాడు అంటరానితనం పై తను చేసిన యుద్ధం, దురాచారాలపై తను రగిల్చిన దహనాల ముగింపు కోసం కాలం నేటికీ ఎదురీదుతూనే ఉంది స్ఫూర్తిదాయకమైన ఆ మహనీయుని ఆలోచనలు ఏ తరానికైనా ఊపిరినిచ్చే పవన వీచికలే అవుతాయి......................... చీపెల్లి బాపు 9849863034...........(తేదీ 14-4-2025 సోమవారం రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా)